యువ ఆపద మిత్ర పిలుస్తోంది.. విపత్తుల సమయంలో సేవ చేసేందుకు యువతకు అవకాశం
- 18 నుంచి 40 ఏళ్ల యువతకు అవకాశం.. కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ కూడావిపత్తుల వేళ ప్రజలకు అండగా నిలుద్దాం.. యువ ఆపద మిత్రలో చేరండి
Yuva Aapada Mitra: ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి ప్రాణాలను కాపాడేందుకు యువత ముందుకు రావాలని మేరా యువ భారత్ ఉమ్మడి మెదక్ జిల్లా యువజన అధికారి మూల రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమలు చేస్తున్న ‘యువ ఆపద మిత్ర’ సేవా పథకం ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అర్హత కలిగిన యువతీ యువకులకు ఉచిత విపత్తు స్పందన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
18 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన యువతీ యువకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చని పేర్కొన్నారు. కూలీలు, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులతో పాటు సేవా భావం ఉన్న ప్రతి ఒక్కరూ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ఆగస్టు 31లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) నిపుణుల ఆధ్వర్యంలో ఉచిత విపత్తు నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి వాలంటీర్‌కు సుమారు రూ.10 వేల విలువైన రక్షణ సామగ్రితో కూడిన సేఫ్టీ కిట్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే ఎంపికైన అభ్యర్థులకు రూ.5 లక్షల విలువైన ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారిక ధ్రువీకరణ పత్రం కూడా అందజేస్తారు. దీంతో యువతకు విపత్తుల సమయంలో స్వచ్ఛంద సేవ చేయడంతో పాటు అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు, శిక్షణ పొందే అవకాశం లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, సిద్దిపేట, మిట్టపల్లి విభాగానికి చెందిన హెడ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కొర్వి వినయకళ కూడా యువతను ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు శిక్షణ పొందిన వాలంటీర్ల సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9650889829, 9963056730 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.



