ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కాలనీ కేటాయించాలి: సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ

ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కాలనీ కేటాయించాలి: సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ

  • తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్.
  • సెప్టెంబర్ 17 నాటికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కమిటీకి విజ్ఞప్తి.
  • ఫ్యూచర్ సిటీలో ఉద్యమకారుల కోసం 600 ఎకరాలతో ప్రత్యేక కాలనీ ఏర్పాటు ప్రతిపాదన.
  • ఉద్యమకారులకు EHS తరహాలో ఉచిత వైద్య సేవలు, హెల్త్ కార్డులు ఇవ్వాలని సూచన.
  • 500–600 మంది ఉద్యమకారుల వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు సంఘం సిద్ధమని కాచం సత్యనారాయణ వెల్లడి.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన చర్చా వేదికలో ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు ప్రక్రియ, భవిష్యత్ సంక్షేమ చర్యలపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ ఉద్యమకారుల తరఫున రూపొందించిన ఏకవాక్య తీర్మానాన్ని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, రాములు నాయక్లకు అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్, అధికారిక గుర్తింపు కార్డులు వెంటనే మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి హామీలను అమలు చేయాలని కోరారు.

Read More వినాయక నిమజ్జనంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

గతంలో శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన విధంగానే ప్రస్తుతం ఏర్పాటు చేసిన గుర్తింపు కమిటీ కూడా ఉమ్మడి పది జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ఉద్యమకారులు, జర్నలిస్టులు, విద్యార్థి నాయకులు, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి నుంచి వివరాలు సేకరించాలని సూచించారు. సెప్టెంబర్ 17 నాటికి కనీసం ప్రాథమిక గుర్తింపు కార్డులు జారీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారుల ఖచ్చితమైన వివరాలు ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తాయని, తద్వారా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల ఉద్యమకారుల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయించాలని ఆయన ప్రతిపాదించారు. ప్రతి నియోజకవర్గానికి 20 ఎకరాల చొప్పున మొత్తం 600 ఎకరాల్లో ప్రత్యేక ఉద్యమకారుల కాలనీ లేదా తెలంగాణ అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఈహెచ్‌ఎస్ (EHS) తరహాలో ఉద్యమకారులకు కూడా ఉచిత వైద్య సేవలు అందేలా ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వద్ద 2014 నుంచి నమోదైన 500 నుంచి 600 మంది ఉద్యమకారుల పూర్తి వివరాలు, పోలీసు కేసుల సమాచారం, ఫోటో ఆధారాలు సిద్ధంగా ఉన్నాయని, గుర్తింపు ప్రక్రియ కోసం అవసరమైతే వాటిని ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కాచం సత్యనారాయణ తెలిపారు. చివరగా ప్రభుత్వం ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేపట్టి, ఉద్యమకారుల హక్కుల సాధన కోసం అవసరమైతే చట్టసభల్లోనూ గళమెత్తుతామని ఆయన స్పష్టం చేశారు.

Related Posts