నేషనల్ హ్యాండ్లూమ్ అధికారులతో జక్కని అనిత సమావేశం 

నేషనల్ హ్యాండ్లూమ్ అధికారులతో జక్కని అనిత సమావేశం 

విశ్వంభర, న్యూఢిల్లీ:-తెలంగాణ రాష్ట్ర చేనేత రంగ సమగ్ర అభివృద్ధి, నేతన్నల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ (టెస్ట్కో) వైస్ చైర్మన్ జక్కని అనిత బుధవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో విస్తృతంగా పర్యటించారు. కేంద్ర జౌళి (టెక్స్‌టైల్స్) మంత్రిత్వ శాఖ మరియు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NHDC) కి చెందిన పలువురు ఉన్నతాధికారులతో ఆమె వరుసగా కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హ్యాండ్లూమ్స్ డెవలప్‌మెంట్ కమిషనర్ డాక్టర్ ఎమ్. బీనా (IAS), అడిషనల్ డెవలప్‌మెంట్ కమిషనర్  నిపుణ్ పాండే, మరియు ఎన్‌హెచ్‌డీసీ (NHDC) మేనేజింగ్ డైరెక్టర్  రాజీవ్ అశోక్ లతో జక్కని అనిత భేటీ అయ్యారు. తెలంగాణ చేనేత రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, మార్కెట్ విస్తరణకు చేపట్టాల్సిన కొత్త కార్యక్రమాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. 

*పెండింగ్ నిధులు, కొత్త క్లస్టర్లపై చర్చ:*
రాష్ట్ర చేనేత రంగానికి కేంద్రం నుండి రావలసిన పెండింగ్ నిధులను త్వరితగతిన విడుదల చేయాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా కొత్త చేనేత క్లస్టర్ల ఏర్పాటు, నేత కార్మికులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం (టెక్నాలజీ అప్‌గ్రేడేషన్), అంతర్జాతీయ మార్కెటింగ్ మరియు ఎగుమతి (ఎక్స్‌పోర్ట్స్) అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ప్రస్తుత డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తెలంగాణ చేనేత ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు.

Read More పాతబస్తీలోని మండపాలనుసందర్శించిన సిపి సజ్జనార్, సౌత్ జోన్ డిసిపి కిరణ్ కారే 

*కేంద్ర అధికారుల సానుకూల స్పందన:*
రాష్ట్రంలో చేనేత రంగానికి, నేతన్నల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర అధికారులు ఈ సందర్భంగా అభినందించినట్లు సమాచారం. తెలంగాణ చేనేత రంగానికి అవసరమైన పూర్తి మద్దతు, సాంకేతిక సహకారాన్ని అందిస్తామని వారు హామీ ఇచ్చారు. కాగా, తెలంగాణ నేతన్నల సంక్షేమం కోసం కేంద్ర అధికారులు అందించిన విలువైన మార్గదర్శకత్వం, సానుకూల మద్దతు పట్ల  జక్కని అనిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags: