నగర యువతికి జాతీయస్థాయి గుర్తింపు
‘స్టార్ మిస్ టీన్ ఇండియా–2026’లో హైదరాబాద్ అమ్మాయి రిషిత పెన్మెత్సకు ఫస్ట్ రన్నరప్ టైటిల్
విశ్వంభర, హైదరాబాద్: జైపూర్‌లో నిర్వహించిన ‘స్టార్ మిస్ టీన్ ఇండియా–2026’ జాతీయస్థాయి అందాల పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల రిషిత పెన్మెత్స ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి ప్రతిభ చాటింది. జైపూర్‌లోని జెడ్ స్టూడియోస్‌లో జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 14 నుంచి 18 ఏళ్ల వయసున్న 31 మంది యువతులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ఒబుల్‌రెడ్డి పబ్లిక్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న రిషితకు ఇది తొలి అందాల పోటీ కావడం విశేషం. తల్లిదండ్రులు ప్రత్యూష, రామకృష్ణ ప్రోత్సాహంతో మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ పొంది, తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయి టైటిల్‌ను సాధించింది. ఈ సందర్భంగా రిషిత మాట్లాడుతూ.. అందాల పోటీలు కేవలం అందం, అలంకరణకే పరిమితం కావని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక అవగాహనకు కూడా ప్రాధాన్యముంటుందని తెలిపింది. ఇలాంటి పోటీలపై ఉన్న అపోహలను వీడి, ఆసక్తి కలిగిన విద్యార్థినులను తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రోత్సహించాలని కోరింది. భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయి పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని పేర్కొంది. తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన రిషితను పలువురు అభినందించారు.



