అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుంది: జగదీశ్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
విశ్వంభర, సూర్యాపేట : అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేటలోని శ్రీ చైతన్య స్కూల్ పోలింగ్ బూత్ లో జగదీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లేనిలోటు స్పష్టంగా కనపడుతుందని ప్రజలే చెబుతున్నారని అన్నారు. ప్రజా స్పందన చూస్తుంటే మెజారిటీ సీట్లు మావే అనే నమ్మకం కలుగుతుందన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఊహిస్తున్న మార్పు వస్తుందని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ తమ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటుని సరిగ్గా వినియోగించుకొకపోతే జరగబోయే నష్టానికి మనమే బాధ్యులమవుతామని పేర్కొన్నారు.