మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ కొలువుదీరనుంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ కొలువుదీరనుంది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూన్ 8వ తేదీన ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.
ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ 272ను ఎన్డీయే దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.
మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రధాని మోడీ నివాసంలో కేంద్ర కేబినెట్ చివరిసారిగా భేటీ అయింది. ప్రస్తుత లోక్ సభ రద్దుకు సిఫార్సు చేసింది. బుధవారం సాయంత్రం 4గంటలకు ఎన్డీయే భాగస్వామ్య పక్షనేతలు కీలక సమావేశం జరగనుంది.