హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైందని ఇరాన్ మీడియా ఛానెల్‌లు వెల్లడించాయి.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైందని ఇరాన్ మీడియా ఛానెల్‌లు వెల్లడించాయి. సుమారు 17 గంటలు గడిచిన తరువాత హెలికాప్టర్ శిథిలాలు దొరికినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందం ప్రమాద స్థలానికి చేరుకుందని తెలిపారు.
అయితే, ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో రెండు హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. కాగా, ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై పైలట్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి దారితీనట్లు సమాచారం. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63 ఏళ్లు) తూర్పు అజర్‌బైజాన్‌కు వెళ్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్‌బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ప్రమాదం జరిగింది.
మరో ఇరానీ మీడియా ప్రమాద స్థలంలో ఎవరూ సజీవంగా ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని వెల్లడించింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు హెలికాప్టర్‌లో విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలెక్ రహ్మతి, తబ్రిజ్ రాయల్ ఇమామ్ మొహమ్మద్ అలీ అల్హాషెమ్, ఒక పైలట్, సెక్యూరిటీ చీఫ్ , ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారని ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ పేర్కొంది.