Nigeria: మసీదులో బాంబు పేలుడు.. 8మంది మృతి..!
సుమారు 38ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి కానో మారుమూల గడాన్ గ్రామంలోని మసీదుపై దాడి చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఉత్తర నైజీరియాలోని కానో రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి ఏకంగా మసీదుపైనే పేలుడు పదార్థాలతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోగా 16మంది తీవ్రగాయాలపాలయ్యారు. సుమారు 38ఏళ్లు ఉన్న ఓ వ్యక్తి కానో మారుమూల గడాన్ గ్రామంలోని మసీదుపై దాడి చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పేలుడు ధాటికి మసీదు వద్ద గోడలు కూలాయి. ఫర్నీచర్ దగ్ధమైంది. కొందరు చిన్నారులు నిప్పులు చూసి భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కుటుంబ విభేదాల వల్లే కక్ష పెంచుకుని దాడికి పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని చెప్పారు. గాయపడిన వారిని రాష్ట్ర రాజధానిలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు పిల్లలు ఉన్నారు.
అనుమానితుడు స్థానికంగా తయారు చేసిన బాంబుతో మసీదుపై దాడి చేసినట్లు విచారణలో తేలిందని స్థానిక పోలీసు చీఫ్ ఒమర్ సాండా మీడియాతో వెల్లడించారు. ఈ ఘటనకు ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ సంఘటన ఉత్తర నైజీరియాలోని అతిపెద్ద రాష్ట్రమైన కానోలో భయాందోళనలకు దారితీసింది. ఇక్కడ మతపరమైన అశాంతి వాతావరణం నెలకొంది. ఇది కొన్నిసార్లు హింసకు దారితీస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి.