బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరు మృతి..!
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీపేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీపేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురు కార్మికులకు తీవ్రగాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బిజ్నోర్‌లోని హల్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగోడ గ్రామంలో ఓ బాణసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించి మంటలంటుకున్నాయి.
ఆదివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు, మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అప్పటికే ఓ కార్మికుడు మృతిచెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయాలపాలైన మరో నలుగురిని ఉన్నత కేంద్రానికి తరలించారు. మృతుడు గోపాల్పూర్ నివాసిగా స్థానికులు తెలిపారు. అమిత్ మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.