సల్మాన్ ఖాన్ హత్యకు పాక్ నుంచి ఏకే 47 తుపాకులు
ముంబైలోని బాద్రాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు.
ముంబైలోని బాద్రాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. సల్మాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. కొంతకాలంగా సల్మాన్‌ను టార్గెట్ చేసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా స్కెచ్‌తో సల్మాన్‌ను అంతమొందించేందుకు కుట్రలు పన్నుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సల్మాన్ కదలికలపై నిరంతరం నిఘా వేయడంతో పాటు ఆయన కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకోసం పాకిస్థాన్ నుంచి ఏకే 47 సహా పలు ఆయుధాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాక్ కు చెందిన ఓ ఆయుధాల సప్లయర్ నుంచి ఏకే 47, ఎం 16, ఏకే 92, హై కాలిబర్ ఆయుధాలను తెప్పించినట్లు పేర్కొన్నారు.
ఈ కాల్పుల ఘటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బిష్ణోయ్ గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పుల కేసును లోతుగా దర్యాఫ్తు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు అనుమానితులను ప్రశ్నించగా సల్మాన్ ను హత్య చేయడానికి బిష్ణోయ్ గ్యాంగ్ భారీ ప్రణాళిక రచించినట్లు బయటపడింది.కాగా, రాజస్థాన్‌లో కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది.