ఉదయం 6 గంటలకే ఇంటి వద్దకు పెన్షన్లు.. ఏపీ సీఎస్ ఆదేశాలు
ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలతో జులై 1న ఉదయం 6 గంటలకే పెన్షన్ ను ఇంటి వద్దకు అందించబోతున్నారు సచివాలయ ఉద్యోగులు. గత ప్రభుత్వం లాగా కాకుండా.. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ అందిస్తామని ఇప్పటికే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా సీఎం నారా చంద్రబాబు ఆదేశాలతో సీఎస్ నీరభ్ కుమార్ అలెర్ట్ అయ్యారు. ఉదయం 6గంటల నుంచే పెన్షన్ల ప్రక్రియ ప్రారంభించాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెన్షన్లను.. ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారుల చేతుల్లో పెట్టాలని సీఎస్ ఆదేశించారు.
ఇందుకోసం ముందుగానే బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకుని ఉండాలని సూచించారు. ఇక పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటుగా.. గత 3 నెలల బకాయిలు మూడు వేలు కలిపి జులై 1 వ తేదీన లబ్ధిదారులకు రూ.7 వేలు అందనుంది. ఇందులో సచివాలయ ఉద్యోగులే ఈ నెల పింఛన్లలో కీలకంగా వ్యవహరించబోతున్నారు.



