గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న కరాటే కల్యాణి.. లారీ ముందు కూర్చుని నిరసన
కరాటే కల్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఎప్పటికప్పుడు హిందువులు, గుడుల విషయంలో ఫైట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది గోవుల అక్రమ రవాణాను అడ్డుకుంటూ నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కరాటే కల్యాణి కూడా ఇలాంటి పనే చేసింది.
ఆమె విజయనగరం జిల్లా రగవరపుకోట నియోజకవర్గంలో పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంది. స్థానిక నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నుండి కొత్తవలస అక్రమ తరలింపు స్టాక్ పాయింట్ వద్దకు జరుగుతోందని ఆరోపించారు. ఫేక్ నెబర్ ప్లేట్లు వేసిన వాహనాల్లో గోవులను తరలిస్తున్నారంటూ మండిపడ్డారు కరాటే కల్యాణి.
గతంలో కూడా తాను 150 గోవులను కాపాడి పంపిస్తే ఇప్పుడు అవి అక్కడ లేవని తెలిపారు. ఇక గోవులను తరలిస్తున్న లారీకి అడ్డుగా కూర్చుని మరీ ఆమె నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక హోంగార్డును మాత్రమే అక్కడకు పంపినట్టు కరాటే కల్యాణి ఆగ్రహం తెలిపారు.