సీఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ బహిరంగ లేఖ
విశ్వంభర, కరీం నగర్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి రైతులకు సాగునీళ్ళు ఇవ్వాలని బిఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేసారు. కాళేశ్వరం ప్రాజెక్టు ను బద్నాం చేసేందుకు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కాంగ్రెస్ బిజేపి రాజకీయం చేశాయని బిఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. మరమ్మత్తుల పేరుతో కాలయాపన చేస్తూ రైతులతో చెలగాటం ఆడొద్దని హితవు పలికారు. కరీంనగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు బిజెపి నేతల వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్ నేతృత్వంలో పదేళ్ళు రైతులకు సాగునీటికి డోకా లేకుండేనని, కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రైతులకు నీళ్లు ఇవ్వలేని దుస్థితి నెలకొందన్నారు. మరమ్మత్తులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనుమతులకు సంబంధం లేదని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంతోనే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి మేడిగడ్డ అంశం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిధిలోకి వెళ్ళిందన్నారు.



