వీధి కుక్కలకు గజ్జి గోకుడు.

పరిసరాలకు రానివ్వని జనం..

వీధి కుక్కలకు గజ్జి గోకుడు.

  • పస్తులుంటున్న శునకాలు
  • గజ్జికి అపరిశుభ్రత కలుషితాహారమే కారణం.
  •  ఇనుగుర్తి, నెల్లికుదురు పశు వైద్యాధికారులు.

విశ్వంభర,ఇనుగుర్తి/ నెల్లికుదురు:గజ్జి గోకుడు వంటి చర్మవ్యాధులు సోకి కాళ్లతో గోకుకుంటూ చెవులు లొట కొడుతూ గ్రామ గ్రామాన కుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో ఏదో ఒక కుక్కకు దురద గోకుడుతో కూడిన గజ్జి ఉండేది. ప్రస్తుతం ఊరూ రా వీధి కుక్కలన్నిటికీ ఈ వ్యాధి సోకుతోంది.ఈ ఫంగస్ తో కూడిన ఎలర్జీ మూలంగా కుక్కల చర్మంపై ఉండబడిన వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి.చర్మం పోలుసులు,బూడిద వర్ణంగా  ఉంటూ కాళ్లతో నిరంతరం గోకడం వలన చర్మం గాయాలపాలై రక్తం కారుతోంది.గజ్జి గోకుడు కుక్కలను చూసి ఇంటి ఆవరణలోకి ఎవరు రానివ్వడం లేదు.శునకాలకు గోకుడు వ్యాధి లేనప్పుడు ఆయా కుటుంబాల వారు మిగిలిన ఆహారమైనా వీధి కుక్కలకు పెట్టేవారు.చర్మ వ్యాధిసోకిన కుక్కలను ఇంటి వైపే రానివ్వడం లేదు. దీంతో రోడ్ల వెంట పక్కన పస్తులతో ఉంటున్నాయి. తిండి లేకపోవడంతో శరీరంలో సత్తువలేక బక్క చిక్కి నకనకలాడుతున్నాయి.

శునకాల బాధ పట్టించుకొనే వారే లేరు.

Read More విజయవాడ హైవేపై పోటెత్తిన వాహనాలు 

చర్మ వ్యాధి మూలంగా కుక్కలు అల్లాడిపోతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పుడైతే స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో సర్పంచులు పాలకవర్గాలు లేక పట్టింపు లేదనుకోవచ్చు. ఈ సమస్య గత 3-4 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ అప్పుడున్న పాలకులు పట్టించుకోలేదు. ఒకటి రెండు కుక్కలకు చర్మ వ్యాధి సోక గానే వాటిని తీసుకువెళ్లి చికిత్స చేయించినట్లయితే ఈ వ్యాధి ఇంత తీవ్రంగా  వ్యాప్తి చెందేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.జంతు ప్రేమికులమని చెప్పుకునే వారైనా వీటి వంక చూడడమే లేదు. సమాజ సేవకులు,యువకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించే గుణం ఉన్న ఎవరైనా సరే సమీపంలోని పశువైద్యశాలలకు గజ్జి సోకిన కుక్కలను తీసుకెళ్లి చికిత్స చేయించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చర్మవ్యాధి నివారణ చర్యలు తీసుకునే విధంగా చొరవ చూపాల్సి ఉందనేది పలువురి మనోగతంగా ఉంది.

      గజ్జి చర్మవ్యాధి చికిత్సతో తగ్గించవచ్చు

       ఇనుగుర్తి, నెల్లికుదురు వెటర్నరీ ఆఫీసర్స్.

చర్మం పై పొరలకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్,ఫంగస్ ఇన్ఫెక్షన్,బాహ్యపరాన్న జీవుల వలన చర్మ వ్యాధులు వస్తాయి. అపరిశుభ్రత, వ్యాధి బారిన పడిన జంతువుల కళేబరాలను,కలుషిత ఆహారం మూలంగా కుక్కలకు అలర్జిటెక్ డెర్మటైటిస్(చర్మ వ్యాధుధి) సోకుతోందని ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల పశువైద్యాధికారులు డా.మోరపాక రవీందర్,డా.సోమ శ్రీనివాస్ తెలిపారు.కుక్కలకు స్నానం వంటివి లేని కారణంగా అపరిశుభ్రత ప్రదేశాలలో ఉండటం మూలంగా ఫంగస్ చేరి గోకుడు గజ్జి వంటి చర్మవ్యాధులకు గురవుతాయని తెలిపారు.చర్మవ్యాధికి ఒకదాని నుంచి మరో దానికి సోకే గుణం ఉంటుంది.అందుకే కుక్కలన్ని ఈ వ్యాధి బారిన పడుతున్నాయి. పెంపుడు కుక్కలు బయట తిరగకపోవడం వలన వాటికి  వ్యాధి చాలా తక్కువగా సోకుతోంది.చికిత్స అందిస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తే అలర్జిటిక్ డెర్మటైటిస్ వ్యాధిని తగ్గించవచ్చు.

Tags: