మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎమ్మెల్యే

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎమ్మెల్యే

  • రైల్వే అధికారులకు పలు సూచనలు, సలహాలు,
  • నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలని సూచన
  • రైల్వేస్టేషన్లో మౌలికవసతుల కల్పనపై ఆరా..

విశ్వంభర, మహబూబాబాద్: కొత్తగా వేస్తున్న మూడో రైల్వే లైన్ కు నాలుగో నంబర్ ఫ్లాట్ ఫారం నిర్మించాలని  మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. బి. మురళీ నాయక్ రైల్వే అధికారులకు సూచించారు. సోమవారంనాడు రైల్వే మూడో లైన్ నిర్మాణపనుల పర్యవేక్షణలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు.  సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మౌళికవసతుల కల్పనపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ రైల్వే మూడో లైన్ కు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో నాలుగో ఫ్లాట్ ఫారం తప్పనిసరిగా నిర్మించాల్సిందే అని అన్నారు. ప్రస్తుతం ఉన్న రెండు ఫ్లాట్ ఫారాలకు అదనంగా నాలుగో ఫ్లాట్ ఫారం నిర్మించకుంటే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. శ్రీనివాస్ టాకీస్ వైపు కేవలం 120మీట్లర్ల బేబీ ఫ్లాట్ ఫారం మాత్రమే నిర్మించి దీనికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా మూడో నంబర్ ఫ్లాట్ ఫారం పై రైలు ఎక్కాల్సి ఉంటుందని అన్నారు. వాస్తవానికి 540మీట్లర్ల ఫ్లాట్ ఫారం అవసరం ఉంటుందన్నారు. వరంగల్ తరహాలో పూర్తిస్థాయి ఫ్లాట్ ఫారం ఉంటేనే పిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ఇబ్బందులు తలెత్తవన్నారు. రోజూ వేలాదిమంది ప్రయాణికులు, లక్షలాది రూపాయల ఆదాయంతో అత్యంత రద్దీగా ఉన్న స్టేషన్లో పూర్తిస్థాయి మౌళికవసతుల కల్పన అత్యవసరం అని అన్నారు. 
రెండునిమిషాలు ఆగే ట్రైన్ ఎక్కాలంటే చివరి సెకన్లలో అయినా ఎక్కే అవకాశం కేవలం నాలుగో ఫ్లాట్ ఫారం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు.  ఈ కార్యక్రమంలో రైల్వే కన్ స్ట్రక్షన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ గంటా శ్రీనివాస్ తోపాటు కాంగ్రెస్ నాయకులు రామగోని రాజు, శంతన్ రామరాజు, చలమల్ల నారాయణ, మదన్ గోపాల్ లోయ, నర్సింహారావు, సిరిపురం వీరు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags: