డాక్టర్ కూరెళ్ళ చేతుల మీదుగా సాహిత్య వ్యాస సంపుటి 'నెరుసు' పుస్తకావిష్కరణ...

డాక్టర్ కూరెళ్ళ చేతుల మీదుగా సాహిత్య వ్యాస సంపుటి  'నెరుసు' పుస్తకావిష్కరణ...

విశ్వంభర, రామన్నపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య రాసిన సాహిత్య వ్యాస సంపుటి 'నెరుసు' పుస్తకాన్ని శనివారం రోజు రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయంలో మధురకవి, మహాకవి దాశరథి పురస్కార గ్రహీత, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ కృష్ణ కౌండిన్య గత 30 సంవత్సరాల నుండి రాసిన వ్యాసాలలో కొన్నింటిని పుస్తక రూపంలో తీసుకురావడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. కవిగా, రచయితగా, అధ్యాపకునిగా, సాహితీ సంస్థ నిర్వాహకునిగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన డాక్టర్ కృష్ణ కౌండిన్య సాహితీరంగంలో దిగ్గజాలైన కవులు, రచయితలు రాసిన పుస్తకాలపై విమర్శనాత్మకమైన వ్యాసాలను రాసి విమర్శకుడిగా సాహితీ రంగంలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. ఆయా పత్రికలలో ప్రచురించబడిన కొన్ని వ్యాసాలను 'నెరుసు' అను పేరుతో పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని అన్నారు. రచయిత డాక్టర్ కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ పలువురు కవులు, రచయితలు రాసిన పుస్తకాలపై విమర్శనాత్మకంగా రాసిన వ్యాసాలు పలు పత్రికల్లో ప్రచురించబడి పాఠకుల మన్ననల్ని  పొందడం జరిగిందని, డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య చేతుల మీదుగా కూరెళ్ళ గ్రంథాలయంలో తన పుస్తకం ఆవిష్కరించబడడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూరెళ్ళ గ్రంథాలయ గ్రంథపాలకులు తాటిపాముల స్వామి, మధు తదితరులు పాల్గొన్నారు.

Tags: