అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్, 11 లక్షల విలువగల సొత్తు స్వాధీనం
గత కొంతకాలంగా మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లు , మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను చాకచక్యంగా పట్టుకున్నారు మెట్ పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డి , మల్లాపూర్ ఎస్సై కే రాజు. నిందితుడి నుండి 103 గ్రాముల బంగారు ఆభరణాలు, 125.3 గ్రాముల వెండి ఆభరణాలు మరియు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇక వివరాల్లోకివెళ్తే జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ మెట్పల్లి డిఎస్పి ఏ రాములు పర్యవేక్షణలో, మెట్ పల్లి సీఐ ఏ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించింది. 18-02-2025 మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మల్లాపూర్ ఎస్సై కే రాజు తన సిబ్బందితో కలిసి ముత్యంపేట గ్రామ శివారులోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, మోటార్ సైకిల్ పై వస్తున్న నిందితుడిని అనుమానాస్పద స్థితిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఈ అంతర్ జిల్లా గజదొంగను చాకచక్యంగా పట్టుకున్న మెట్ పల్లి సిఐ ఏ నిరంజన్ రెడ్డి, మల్లాపూర్ ఎస్సై కే రాజు , వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డిఎస్పి ఏ రాములును ప్రత్యేకంగా అభినందించారు.



