బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండాలి
విశ్వంభర, మహబూబాబాద్: బాలికలు చదువుతోపాటు క్రీడా, సామాజిక అంశాలు, ఆర్థిక అభివృద్ధి, స్వయం రక్షణలో ముందుండాలని
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. జాతీయ బాలిక దినోత్సవం-25, సందర్భంగా గురువారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో స్త్రీ, శిశు, సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమాజంలో బాల బాలికలు సమానమని, బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు.జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని బేటి బచావో బేటి పడావో నినాదంతో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో మాట్లాడుతూ..బాలికలు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని వారు లక్ష్యాన్ని నిర్దేశించుకుని, సాధన కొరకు కృషి చేయాలని, అధికారులంతా బాలికల అభ్యున్నతకి తోడ్పాటును అందించాలని సూచించారు. బాలికలో ఉన్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలన్నారు. సమాజంలోఅవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, భిక్షాటన, అత్యాచారాలు, బ్రూణ హత్యలు,బాల కార్మిక నిర్మూలన, వేధింపులు, అక్రమ దత్తత నిర్ములించి, బాలికల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలన్నారు.
విద్యతోపాటు సామాజిక అంశాలు, క్రీడలు, ఆర్థిక అభివృద్ధి, స్వయం రక్షణ పై ప్రభుత్వం అనేక కార్యక్రమాలు పథకాలు నిర్వహిస్తుందని,
ఈ కార్యక్రమాల్లో బాలికలు ముందుండాలని సూచించారు.