ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
విశ్వంభర, భూపాలపల్లి: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఈ నెల 27న జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో కాటారం, భూపాలపల్లి డివిజన్లు పీఓ, ఏపీఓలకు రెండో విడత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ముందురోజే చేరుకుని ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ సామగ్రిని పరిశీలించుకు పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. 26వ తేదీ ఉదయం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామగ్రి అందజేస్తామని తెలిపారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లుకు తావులేకుండా ఎన్నికల విధులు నిర్వహించాలని, ఏదేని పొరపాటు జరిగితే ఎన్నికల సంగం ఆదేశాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, భూపాలపల్లి ఆర్డీఓ రవి, పీఓలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.



