దిలావర్‌పూర్ రండి:కేటీఆర్‌

దిలావర్‌పూర్ రండి:కేటీఆర్‌

* ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ‌పై అక్కడే తేలుద్దాం 
* మంత్రి సీతక్క సవాల్‌

విశ్వంభ‌ర‌, హైదరాబాద్‌:   బీఆర్ ఎస్  హయాంలోనే నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ పరిశ్రమకు అనుమతులు ఇచ్చారని మంత్రి సీతక్క  అన్నారు. ఈవిషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కు చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే పరిశ్రమకు అనుమతులు ఎవరు ఇచ్చారో మాట్లాడదామని.. దిలావర్‌పూర్‌ రావాలని సవాల్‌ విసిరారు. హైదరాబాద్‌లో గాంధీభవన్‌ వద్ద సీతక్క మీడియాతో మాట్లాడారు. 

‘‘ బీఆర్ ఎస్‌ హయాంలో ఎన్నో పరిశ్రమలకు కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండా అనుమతులు ఇచ్చారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను రియల్‌ ఎస్టేట్‌ కోసం తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం గ్రామసభల్లో ఒకరిద్దరిని రెచ్చగొట్టి అధికారుల పైకి ఉసిగొల్పుతున్నారు. ఇథనాల్‌ పరిశ్రమలో డైరెక్టర్‌గా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వియ్యంకుడు ఏపీకి చెందిన పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు ఉన్నారు. ఆ పరిశ్రమకు అనుమతులు ఇచ్చే సమయానికి మరో డైరెక్టర్‌గా తలసాని కుమారుడు సాయి ఉన్నారు. 

Read More ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి:మాజీ సర్పంచ్ ఉజ్జిని నరేందర్ రావు 

కేటీఆర్‌.. ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు?ఆందోళన జరుగుతున్న ప్రాంతానికే వెళ్దాం. ఎవరు అనుమతులు ఇచ్చారో అక్కడే తేలుద్దాం. మీ హయాంలోనే పరిశ్రమకు అనుమతులు ఇచ్చినట్లు ఇప్పటికైనా ఒప్పుకోండి. ఈ అంశంపై ఆధారాలతో సహా త్వరలోనే వాస్తవాలు వెల్లడిస్తాం. అసెంబ్లీలో దీనిపై చర్చ పెడతాం. తప్పుడు ప్రచారాలతో ఎక్కువ రోజులు మనుగడ సాగించలేరు’’ అని సీతక్క మండిపడ్డారు.

కుట్రదారులను బయటపెడతాం
హాస్టళ్లలో వరుస ఘటనల వెనక కుట్ర ఉన్నట్లు భావిస్తున్నామని సీతక్క అన్నారు. దీనిపై విచారణ జరిపి కుట్రదారులను బయటపెడతామని.. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అవసరమైతే అధికారులను సర్వీసు నుంచి తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు.

Tags: