BREAKING: తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి..!
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పలు షరతులను విధిస్తూ మంత్రివర్గ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పలు షరతులను విధిస్తూ మంత్రివర్గ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపై మాత్రమే చర్చించాలని ఈసీ షరతు విధించింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై చర్చించవద్దని పేర్కొంది.
ఈసీ అనుమతి లేకపోవడంతో రాష్ట్ర సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం వరకు ఈసీ అనుమతి కోసం వేచిచూస్తామని, అప్పటికీ రాకపోతే ముఖ్యమంత్రి సహా మంత్రి వర్గమంతా ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ను విన్నవించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఈసీ అనుమతులు ఇవ్వడంతో పార్టీ వర్గాలు శాంతించాయి.
మరోవైపు, రైతు రుణమాఫీ, ప్రస్తుత ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల ప్రణాళిక, రైతులకు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ భేటీలో చర్చించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు (జూన్ 2)న వేడుకల నిర్వహణపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.