ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలి - సిపిఐ డిమాండ్.
విశ్వంభర, ఎల్బీనగర్ : ఎల్బీనగర్‌లోని సితార హోటల్ వెనుక భాగంలో సెల్లార్ తవ్వకాల సమయంలో మట్టిదిమ్మలు కూలిపోవడంతో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరొక కూలీ గాయపడిన ఘటనపై సిపిఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ విషాదకర ఘటనకు టౌన్ ప్లానింగ్ సర్కిల్-3 అధికారుల నిర్లక్ష్యం, బిల్డర్ అభినవ్ , కాంట్రాక్టర్ సిద్ధం సాయినాథ్ దర్శన్ అశ్రద్ధ కారణమని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజల ఇంటి నిర్మాణాలకు అనుమతులు లేకపోతే వెంటనే అధికారులు వేధించి చర్యలు తీసుకుంటారు. కానీ నేషనల్ హైవే పక్కన అక్రమంగా భారీ సెల్లార్ తవ్వకాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు మైనింగ్ శాఖ వైఫల్యం కూడా దీనికి కారణమని విమర్శించారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టి, ప్రాణాపాయ పరిస్థితులు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇకనైనా ఎల్బీనగర్ జోన్‌లో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, కట్టడాలపై జిహెచ్ఎంసి అప్రమత్తంగా ఉండాలని. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించడంతో పాటు, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎల్బీనగర్ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బాతరాజు నరసింహ, ఏఐటీయూసీ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి రమావత్ సక్రు నాయక్, ఏఐటీయూసీ సరూర్నగర్ మండల అధ్యక్ష కార్యదర్శులు పూజారి శ్రీను, బోయపల్లి రాములు గౌడ్, ఎం. మదిలేటి తదితరులు పాల్గొన్నారు.