అమ్మకానికి చిన్నారి.. అడ్డంగా బుక్ అయిన ఆర్ఎంపీ
ముక్కుపచ్చలారని చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఘటన హైదరాబాద్‌లోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఆ చిన్నారిని కాపాడి శిశువిహార్‌కు అప్పగించారు. పీర్జాదిగూడ పరిధిలోని రామకృష్ణనగర్‌లో శోభారాణి మహిళ ఆర్‌ఎంపీగా పనిచేస్తుంది. పిల్లలు అవసరమైన వారికి రూ.4లక్షలకు చిన్నారిని ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ ఆఫర్ ను అందుకోవడానికి ఓ పార్టీ వచ్చి పదివేలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. పేమెంట్ మొత్తం ఇచ్చి చిన్నారిని తీసుకొని వెళ్లడానికి ఆ పార్టీ నిన్న వచ్చింది. ఆ టైంలో పోలీసులు రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు.
శోభారాణితో పాటు.. ఆమెకు సహకరించిన మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని శిశువిహార్ అధికారులకు అప్పగించారు. గత కొంతకాలంగా చిన్నారులను విక్రయిస్తూ శోభారాణి సొమ్ము చేసుకుంటుంది. దీనిపై పక్కా సమాచారం ఉన్న ఎన్జీవో ప్రతినిధులు ఆమెపై నిఘా పెట్టి పిల్లలు కావాలని ఆమెను నమ్మించి స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. ఎన్జీవో ప్రతినిధులే డబ్బు ఇచ్చి చిన్నారిని తీసుకుంటున్న సమయంలో పోలీసులు ఎంటర్ అయ్యి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. శోభారాణి ఎప్పటి నుంచి పిల్లలను అమ్ముతుంది? ఎంతమంది పిల్లలను విక్రయించింది? అసలు పిల్లలను ఎక్కడ నుంచి తీసుకొని వస్తుంది అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బుధవారం విక్రయానికి పెట్టిన చిన్నారి తల్లిదండ్రులు ఎవరు..? అదేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం శోభారాణితో పాటు ఆమెకు సహకరించిన షేక్ సలీంపాషా, చింత స్వప్న పోలీసుల అదుపులో ఉన్నారు.