మోడీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు : మల్లికార్జున్ ఖర్గే
విశ్వంభర, వెబ్ డెస్క్ : ప్రధాని మోడీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవర్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇతర నాయకులతో కలిసి ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగిస్తూ... ప్రధాని మోడీపై మండిపడ్డారు. మోడీ ప్రజాస్వామ్యం గురించి పదేపదే మాట్లాడుతున్నారని కానీ ఏనాడూ దాని సిద్దాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు.
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, రామమందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. "కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదు. మోడీ కి మాత్రమే ఆ అలవాటు ఉంది. కాంగ్రెస్ ఎప్పటికీ చేయలేని పనులపై, అమలు చేయడం సాధ్యం కాని వాటిపై ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు." అని వ్యాఖ్యానించారు. మోడీ ఎక్కడికి వెళ్లినా, విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, సమాజాన్ని విభజించాలనుకోవడం సరికాదని తెలిపారు.