టెట్ లో క్వాలిఫై కాని వారికి మరో ఛాన్స్ః మంత్రి లోకేష్
On
టెట్ ఫలితాల్లో అర్హత సాధించలేకపోయిన వారికి మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ తెలిపారు. వారి కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామన్నారు. కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తైన వారికి కూడా టెట్ లో అవకాశం కల్పిస్తామన్నారు. ఆ తర్వాతనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మొన్న వెల్లడైన టెట్ ఫలితాల్లో 58.4 శాతం మంది అర్హత సాధించినట్టు ఆయన వివరించారు. తమ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మేలు చేసేందుకు ముందు ఉంటుందని ఆయన వెల్లడించారు. అన్ని రకాలుగా నిరుద్యోగులకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ నిర్వహించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా వేధించిందని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలకు పెద్ద పీట వేస్తుందన్నారు.