జెప్టో డెలివరీ బాయ్‌ బైక్‌ సీజ్‌.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై చర్చ

జెప్టో డెలివరీ బాయ్‌ బైక్‌ సీజ్‌.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై చర్చ

  • భార్య ఆస్పత్రిలో ఉందని వేడుకున్న డెలివరీ బాయ్‌.. బైక్‌ సీజ్‌ చేసిన పోలీసులు

Hyderabad Zepto Delivery Boy:హైదరాబాద్‌లో ఓ జెప్టో డెలివరీ బాయ్‌కు ఎదురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. తన భార్య ఆస్పత్రిలో ఉందని, అత్యవసరంగా ఒక్క డెలివరీ చేసి వెంటనే తిరిగి వస్తానని చెప్పినా ట్రాఫిక్‌ పోలీసులు తన బైక్‌ను సీజ్‌ చేసి తీసుకెళ్లారని డెలివరీ బాయ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆర్డర్‌ తీసుకోవడానికి వెళ్లే సమయంలో బైక్‌ను రోడ్డు పక్కన ఉంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు బైక్‌ను సీజ్‌ చేసి తీసుకెళ్లినట్లు సమాచారం. తన భార్య ఆస్పత్రిలో ఉందని, పరిస్థితి అత్యవసరంగా ఉందని పోలీసులకు చెప్పినప్పటికీ బైక్‌ను తీసుకెళ్లకుండా ఆపలేకపోయానని డెలివరీ బాయ్‌ వాపోయాడు.

Read More కొండా కుటుంబాన్ని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ చేయాలి

“నా భార్య హాస్పిటల్లో ఉంది సార్‌.. ఒక్క డెలివరీ చేసి వచ్చేస్తాను” అంటూ పోలీసులను వేడుకున్నప్పటికీ తన పరిస్థితిని పట్టించుకోలేదని అతడు పేర్కొన్నాడు. డెలివరీ పనిపై ఆధారపడి జీవించే తనకు బైక్‌ సీజ్‌ కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరోవైపు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘన జరిగితే పోలీసులు వాహనాలను సీజ్‌ చేసే అవకాశం ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బైక్‌ సీజ్‌ చేయడానికి కారణం ఏమిటన్నది అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Tags: