మహిళలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలి
- వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య సేవలు, వివిధ ఆరోగ్య పరీక్షలు, కార్యక్రమాల గురించి డాక్టర్ అప్పయ్య మరియు ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుబీనాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, గర్భధారణకు ముందే మహిళల్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగంపై అవగాహన పెంపొందించడం కీలకమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో వైకల్యాలు, ఆటిజం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, గర్భధారణ ప్రణాళిక దశలోనే సరైన పోషకాహారం, వైద్య సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.రక్తహీనత (అనీమియా), సికిల్ సెల్ వంటి వ్యాధులపై ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ ప్రాంతంలో హిమోగ్లోబిన్ లోపం కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, నిర్లక్ష్యం చేయకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు, ముఖ్యంగా గర్భస్థ శిశువులో లోపాలను గుర్తించే TIFFA స్కానింగ్‌ను నిర్దిష్ట సమయంలో తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. గర్భిణీల శారీరక ఆరోగ్యంతో పాటు ప్రసవానంతర దశలో మానసిక ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ అవసరమని చెప్పారు. శిశువుల తల్లులకు మానసిక ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించడం ద్వారా కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. అలాగే కుటుంబ నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా తల్లి-శిశు ఆరోగ్యం మెరుగుపరచవచ్చని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని, వైద్య ఆరోగ్య సిబ్బంది మరింత బాధ్యతతో పని చేయాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. ఈ సమావేశంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా సురక్షిత మాతృ దినోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సృష్టిలో మాతృత్వం అనేది మహిళలకు దేవుడిచ్చిన గొప్ప వరం అని అన్నారు. ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్య వైద్యం అనేవి ప్రపంచంలోనే ఎంతో విలువైనవని అన్నారు. 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలతో పాటు మరెన్నో కార్యక్రమాలను తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచనల మేరకు 99 రోజుల కార్యచరణ లో భాగంగా సురక్షిత మాతృత్వ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేకంగా కార్యశాలననిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో సురక్షిత మాతృత్వానికి సంబంధించిన అంశాలపై రూపొందించిన పోస్టర్లను ఎంపీ కడియం కావ్య, మేయర్ సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, మహిళా కార్పొరేటర్ లు ఏనుగుల మానస రాంప్రసాద్, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మన్మోహన్ రాజు, గైనకాలజిస్టుల అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యారాణి, పూర్వ అధ్యక్షురాలు డాక్టర్ శ్రీలక్ష్మి, హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపర్ ఇంటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ మదన్ మోహన్ రావు డాక్టర్ ప్రదీప్ రెడ్డి డాక్టర్ రుబీనా , డాక్టర్ హిమబిందువడాక్టర్ ప్రభుదాస్తదితరులతో పాటు మహిళా సర్పంచ్ లు, మహిళా ఎస్ ఐ లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు,ఇతర మహిళా అధికారులు, అశోక్ రెడ్డి , తదితరులు హాజరయ్యారు.



