ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. బొల్ల శివ శంకర్
విశ్వంభర, మునుగోడు నియోజక వర్గం :- ఇటీవల మరణించిన చేనేత కార్మికులు వర్కాల వేణుగోపాల్, పానుగంటి క్రాంతి, అప్పం యాదమ్మ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కోరారు. అనంతరం వారు ఆర్థికంగా సహకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నేతన్న యాత్ర చైర్మన్, అఖిల భారత పద్మశాలి సంఘం పొలిటికల్ వింగ్ చైర్మన్ బొల్ల శివ శంకర్, అఖిల భారత పద్మశాలి సంఘం పొలిటికల్ వింగ్ జనరల్ సెక్రటరీ డా. సమత, అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగ్ అధ్యక్షులు దుశ్యంతల , ప్రధాన కార్యదర్శి సునీత, హ్యాండ్లూమ్ విభాగానికి చెందిన తిరుమల కోరారు. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. గట్టుప్పల్, పుట్టపాక గ్రామాలకు చెందిన చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కల్గించే అంశం అని వారు తెలిపారు. ఆప్టస్ బ్యాంక్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న అప్పం యాదమ్మతో పాటు ముగ్గురికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని స్పష్టం చేశారు. అప్పుల భాదతో బాధపడుతున్నవారు, ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్న వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు తదితరులు పాల్గోన్నారు.



