మణికొండలో ఇంట్లో ఫైర్‌ యాక్సిడెంట్‌.. 55 నిమిషాల తర్వాత వచ్చిన ఫైర్‌ సిబ్బంది

మణికొండలో ఇంట్లో ఫైర్‌ యాక్సిడెంట్‌.. 55 నిమిషాల తర్వాత వచ్చిన ఫైర్‌ సిబ్బంది

  • మణికొండలో ఫైర్‌ యాక్సిడెంట్‌.. సమయానికి స్పందించని అగ్నిమాపక శాఖ

Manikonda Fire Accident: రంగారెడ్డి జిల్లా మణికొండ పుప్పాలగూడ గోల్డెన్‌ టెంపుల్‌ సమీపంలోని తిరుమల హిల్స్‌ రోడ్‌ నంబర్‌ 11లో ఓ ఇంట్లో వాషింగ్‌ మిషన్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించినప్పటికీ.. ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోవడానికి సుమారు 55 నిమిషాల సమయం పట్టింది. దీంతో ప్రమాద సమయంలో అత్యవసర సేవలు అందడంలో తీవ్ర జాప్యం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మణికొండకు సమీపంలోనే ఫిలింనగర్‌, గోల్కొండ ప్రాంతాల్లో ఫైర్‌ స్టేషన్లు ఉన్నాయని, అక్కడి నుంచి ఫైర్‌ వాహనం వస్తే పది నిమిషాల్లోపే ఘటనాస్థలికి చేరుకునే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే మణికొండ ప్రాంతం గచ్చిబౌలి ఫైర్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందని, పరిధుల కారణంగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ఫైర్‌ ఫైటర్‌ రావాల్సి వచ్చిందని సిబ్బంది తెలిపినట్లు సమాచారం.

Read More గుండాల నూతన ఎస్సైకి కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షలు

ప్రమాదం జరిగినప్పుడు ముందుగా ప్రాణాలు, ఆస్తులను రక్షించడమే ముఖ్యమని.. ఫైర్‌ స్టేషన్‌ పరిధులు, సరిహద్దుల కారణంగా అత్యవసర సేవల్లో ఆలస్యం జరగడం సరికాదని స్థానికులు అంటున్నారు. సమీపంలో ఉన్న ఫైర్‌ స్టేషన్‌ నుంచి వాహనం పంపించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు అలా చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని నిమిషాల ఆలస్యం కూడా భారీ నష్టానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మణికొండ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ఫైర్‌ స్టేషన్‌ నుంచి వెంటనే వాహనం పంపించే విధంగా స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సరిహద్దులు, పరిధుల సమస్యలతో ఫైర్‌ సేవల్లో ఆలస్యం జరగకుండా తెలంగాణ పోలీసు, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఇప్పటికే జరిగిన ఘటనపై అధికారులు స్పందించి ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోవడంలో 55 నిమిషాల ఆలస్యం ఎందుకు జరిగిందో పరిశీలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సమీపంలోని ఫైర్‌ స్టేషన్‌ నుంచే తక్షణం వాహనాన్ని పంపించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags: