తహశీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు మాయం
- - ఫైళ్లు అదృశ్యమైనా.. పట్టించుకోని అధికారులు
- - ఫైళ్ల మాయంపై అధికారులపైనే అనుమానాలు
- - సిబ్బందిని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు
- - మిస్సింగ్ దరఖాస్తుతో బయటపడ్డ విషయం
- - ఏకపక్షంగా తప్పుడు రిపోర్టులిస్తున్న ఎమ్మార్వో
- - క్షుణ్ణంగా పరిశీలించకుండానే రిజెక్ట్‌కు సిఫార్స్
- - తహశీల్దార్ స్వామి తీరుపై బాధితుల ఆగ్రహం
- - కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీచేయాలని వేడుకోలు
- - ఫైళ్ల మాయంపై విచారించాలని ప్రజల విజ్ఞప్తి
విశ్వంభర-సిద్దిపేట:- సిద్దిపేట రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో విలువైన ఫైళ్లు కనిపించడం లేదు. వందలకొద్దీ ఫైల్స్ మాయమైనా అధికారులు అసలు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫైళ్ల మిస్సింగ్‌పై కార్యాలయంలోని తహశీల్దార్, సిబ్బందిని ప్రశ్నిస్తే డొంగ తిరుగుడు సమాధానాలు చెబుతూ అసలు విషయాన్ని దాటవేస్తున్నారు. కోటి లింగాల ఆలయం నుంచి కార్యాలయాన్ని మార్చే సమయంలో ఫైల్స్ మిస్సై ఉండొచ్చని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. రైతుల భూములకు సంబంధించిన కీలక ఫైళ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఫైళ్లను మాయం చేశారా? లేక నిజంగానే తప్పిదారిన మిస్ అయ్యాయా అంటే కచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మిస్సింగ్ దరఖాస్తుతో బయటపడ్డ అసలు విషయం
================================
మండలంలోని పుల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాదాపు నాలుగు నెలల క్రితం మిస్సింగ్ సర్వే నెంబర్ కింద దరఖాస్తు చేసుకున్నాడు. మిస్సింగ్ దరఖాస్తులను వారం నుంచి పదిరోజుల్లో పరిష్కరించాలి. ఒకవేళ పని ఒత్తిడి ఉన్న కనీసం నెలరోజులల్లోనైనా పరిష్కరించాల్సిన బాధ్యత తహశీల్దార్‌పై ఉంది. కానీ రూరల్ తహశీల్దార్ స్వామి మాత్రం తీరిగ్గా నాలుగు నెలల తరువాత దరఖాస్తును పరిశీలించి రెవెన్యూ రికార్డులతో మ్యాచ్ కావడం లేదని తప్పుడు రిపోర్టు రాసి ఆర్డీవోకు పంపించారు. ఆర్డీవో నుంచి రెవెన్యూ అడిషినల్ కలెక్టర్ అక్కడి నుంచి కలెక్టర్‌కు ఫైల్ చేరింది. తహశీల్దార్ ఇచ్చిన తప్పుడు రిపోర్టు చూసి కలెక్టర్ ఫైల్‌ను రిజక్ట్ చేసింది. ఆందోళనకు గురైన దరఖాస్తుదారుడు విషయాన్ని ‘విశ్వంభర’ప్రతినిధితో గోడు వెళ్లబోసుకున్నాడు. ఇదే విషయంపై ఎమ్మార్వోను వివరణ కోరగా తమ దగ్గరున్న ఫైల్స్‌తో దరఖాస్తుదారుడి నెంబర్ మ్యాచ్ కావడం లేదని చెప్పాడు. దరఖాస్తుదారుడికిచ్చిన నెంబర్‌ను సంబంధిత డీఆర్ బుక్‌లో ఎంట్రీ చేసుకోకపోవడం రెవెన్యూ తప్పిదమని, దరఖాస్తుదారుడి తప్పిదం కాదని రిపోర్టర్ ప్రశ్నించగా.. అసలు ఆ ఫైలే దొరకడం లేదని అసలు విషయం చెప్పాడు. ఫైలే దొరకనప్పుడు తప్పుడు రిపోర్టు ఎట్లా ఇచ్చారని రిపోర్టర్ ప్రశ్నించగా తనపై ఆర్డీవో, కలెక్టర్‌కు ఫిర్యాదు చేయండని.. వారికి సమాధానం చెప్పుకుంటానని దురుసుగా మాట్లాడటం గమనార్హం.
వాంగ్మూలం తీసుకుని పరిష్కరించొచ్చు
==========================
పై దరఖాస్తుదారుడు దాదాపు 35-40ఏండ్ల క్రితం భూమిని కొనుగోలు చేసి కబ్జాలో ఉన్నాడు. ఆ వ్యక్తి పెట్టుకున్న దరఖాస్తు ప్రకారం ఆర్‌ఐ ఫీల్డ్ విజిట్ చేసి పంచనామా చేశాడు. దాదాపు 30ఏండ్లకు పైగా సదరు వ్యక్తి కబ్జాలో ఉంటున్నాడు అని పంచనామా రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నాడు. అయినా తహశీల్దార్‌కు నమ్మకం కుదరలేదు. కార్యాలయానికి సంబంధించిన డీఆర్ బుక్కు తప్పిపోవడంతో తప్పుడు రిపోర్టు ఇచ్చి బాధితుడికి తీరని బాధని మిగిల్చాడు. ఒకవేళ నిజంగానే తహశీల్దార్ అనుకున్నట్టు దారఖాస్తుదారుడి డీఆర్ నెంబర్ మ్యాచ్ కానప్పుడు మానవీయ కోణంలో తన దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో పరిశీలించాలని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రిటైర్డ్ ఎమ్మార్వో తెలిపారు. భూమి కొన్న పత్రాలు, పహణీలు చెక్ చేయాలి. అయినప్పటికీ సంతృప్తి చెందకపోతే ఎవరైతే భూమిని అమ్మినారో వారి వాంగ్మూలం తీసుకోవాలి. నిజంగానే దరఖాస్తుదారుడికి భూమిని అమ్మారా? ఏ సంవత్సరంలో అమ్మారు? ఎన్ని ఎకరాలు అమ్మినారు? అమ్మిన మాట నిజమేనా? సదరు వ్యక్తి పెట్టుకున్న అప్లికేషన్‌పై మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడుగొచ్చు. అప్పటికీ తహశీల్దార్ సంతృప్తి చెందకపోతే బేషరత్‌గా ఫైల్‌ను రిజక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఓ జూనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారికి కూడా తెలిసి ఉంటాయి. పదేండ్లకు పైగా తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మేజిస్ట్రేట్ స్థాయి అధికారికి తెల్వకపోవడం శోచనీయం. పైగా నేను ఆ విధంగా చేయనని కరఖండిగా చెప్పడం గమనార్హం. ఇలాంటి అవగాహన లేని అధికారులతో ప్రజలకు ఇబ్బందులే తప్ప ఎలాంటి లాభం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల ఆక్రందన
=============
భూ భారతి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నా.. రూరల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చినప్పటికీ పరిష్కారానికి ముందడుగు పడటం లేదు. కేవలం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమయ్యారు. ఆ నోటీసులు కూడా ఇంకా చాలా మందికి అందలేదని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫౌతి, మిస్సింగ్ వంటి చిన్నచిన్న తప్పులను వారం, పది రోజుల్లో పరిష్కరించొచ్చు. అవి కూడా పరిష్కరించడం లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. అమ్యామ్యాలు వస్తాయనే ఆశతో వాటికి అడ్డంగులు సృష్టిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.



