రాహుల్ అరెస్టు ప్రజాస్వామ్య హననం
- హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్
విశ్వంభర, హుస్నాబాద్: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీల అరెస్టులను ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని, అనంతరం శాంతియుత నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలుగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ధర్నాలో పాల్గొన్న నాయకులు "నీట్ పేపర్ లీక్‌కు బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి", "నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్లో చర్చ జరపాలి", "విద్యార్థులపై లాఠీచార్జికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి", "గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి", "ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి" అంటూ ఫ్లకార్డులతో నినాదాలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి సంఘీభావంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిని అక్రమంగా అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన దేశ స్వాతంత్ర్య ఉద్యమం, సత్యాగ్రహాన్ని గుర్తు చేసిందని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఎత్తడం దురదృష్టకరమని, అనేక మంది విద్యార్థులు గాయపడినా కేంద్ర హోంమంత్రి కనీసం స్పందించలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా "ఛాత్రోంకీ గుంజ్" కార్యక్రమం ద్వారా విద్యార్థుల సమస్యలను వినిపిస్తున్నారని, అలాంటి నాయకుడిని శాంతియుత నిరసన చేసినందుకు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంపై దాడేనని అన్నారు. ప్రధాని నివాసం ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసినా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరిపి నిజాలను దేశ ప్రజలకు వెల్లడించాలని, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి నిష్పక్షపాత విచారణ చేపట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



