ఆ రోజు ఇంట్లోనే ఉన్నా...తూటాల శబ్దంతోనే నిద్రలేచా : సల్మాన్ ఖాన్
విశ్వంభర, ముంబయి : ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన నివాసం ఉంటున్న ముంబయిలోని గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్దకు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన అనంతరం దుండగులు బైక్ పై వెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. ఇది గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగా ముంబయి పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై నటుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
" ఈ ఘటన జరిగిన రోజు నేను ఇంట్లోనే ఉన్నా. ముందు రోజు రాత్రి పార్టీ వల్ల లేట్ గా పడుకున్నా. తెల్లవారుజామున నా ఇంటి బాల్కనీ వద్ద తుపాకీ పేలిన శబ్దాలు వినిపించడంతో వెంటనే ఉలిక్కిపడి నిద్రలేచా. బాల్కనీకి వెళ్లి చూడగా బయట ఎవరూ లేరు." సల్మాన్ వాంగ్మూలంలో వెల్లడించారు. నటుడితో పాటు అతని సోదరుడు అర్బాజ్ ఖాన్ నుంచి పోలీసులు స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసుకున్నారు.