నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. ఇద్దరి అరెస్ట్
విశ్వంభర, ఢిల్లీః నీట్ యూజీ పేపర్ లీక్ కేసు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్ లీక్ కావడంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటన కుదిపేస్తోంది. కాగా దానిపై ఇప్పటికే సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. విచారణలో వేగం పెంచిన సీబీఐ.. గురువారం నాడు కీలక అడుగు వేసింది.
మొదటిసారి ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. బీహార్‌లోని పాట్నలో వీరిని అరెస్ట్ చేశారు. నిందితులను మనీష్ కుమార్, అశుతోష్ కుమార్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ పేపర్ లీకేజీలో కీలకంగా వ్యవహరించినట్టు సీబీఐ గుర్తించింది. అశుతోష్ పేపర్‌లీకేజీకి సారధ్యం వహించగా.. లీకైన క్వశ్చన్ పేపర్లను అమ్ముకునేందుకు మనీష్ గిరాకీలను పట్టుకొచ్చినట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ కలిసి పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో తీసుకుని పేపర్ అమ్ముకున్నట్టు సమాచారం. బీహార్ లోనే ఈ పేపర్ పెద్ద ఎత్తున లీక్ అయినట్టు సీబీఐ అనుమానిస్తోంది. బీహార్ కేంద్రంగానే ఈ లీకేజీ దేశ వ్యాప్తంగా జరిగినట్టు సీబీఐ అంచనా వేస్తోంది. నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు అధికారులు.