విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి 

విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలి 

విశ్వంభర, శంషాబాద్ :  దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పరీక్షల పేపర్ లీకేజీలను, ఢిల్లీలో నిరసలకు దిగిన విద్యార్ధులపై లాఠాచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ..కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ 24న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్,  ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచమల్ల వర్ధన్  అన్నారు. శంషాబాద్  కేంద్రంలో ఎస్ఎఫ్ఐ,  ఎన్.ఎస్.యు.ఐ ల ఆధ్వర్యంలో  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు కె వై ప్రణయ్, రచమాల్ల వర్ధన్ మాట్లాడుతూ, జూలై 24న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువత, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ, ఆ ఘటనలపై నిష్పాక్షికంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో వరుసగా జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన ఎన్‌టీఏ ను రద్దు చేసి, పారదర్శకమైన పరీక్షల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమైన వీబీఎస్ఏ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు జూలై 24న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులు, యువజనులు, ప్రజాస్వామ్యవాదులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ  మండల నాయకులు ప్రసాద్, తరుణ్, రుద్రాక్ష, శివ రాథోడ్,సమీర్, ఆన్సర్,సుశాంత్, దిక్షీత్, అక్షయ్,తదితరులు పాల్గొన్నారు.

Tags: