లక్ష్మారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి

లక్ష్మారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి

  •  బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు

విశ్వంభర, హుస్నాబాద్ : బీజేపీలో సంస్థాగత నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ కన్వీనర్ పదవులు రద్దయ్యాయని, అయినప్పటికీ తాను ఇప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్‌నంటూ చెలామణి అవుతున్న లక్ష్మారెడ్డిపై రాష్ట్ర పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ మేరకు పేర్కొన్నారు. బీజేపీలో ప్రతి ఐదేళ్లకోసారి సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా బూత్ నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తారని, ఆ క్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పదవులు కూడా రద్దయ్యాయని పేర్కొన్నారు. అయితే లక్ష్మారెడ్డి మాత్రం ఇప్పటికీ అదే హోదాను ఉపయోగించుకుంటూ కార్యకర్తలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐఆర్ సమావేశానికి తనకు అనుకూలంగా ఉన్న వారినే పిలిపించి, పార్టీలో వర్గ విభేదాలను ప్రోత్సహించే ప్రయత్నం చేశారని విమర్శించారు. కార్యకర్తలను బెదిరిస్తూ, కొందరికి పదవులు రావని ప్రచారం చేస్తూ పార్టీని రెండు వర్గాలుగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వరుసగా విజయం సాధించిన తర్వాత కూడా పార్టీ క్రమశిక్షణతోనే పనిచేసిందని, ప్రస్తుతం వ్యక్తిగత ఆధిపత్యం కోసం పార్టీకి నష్టం కలిగించే చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ స్పందించి, పూర్తి నివేదికను రాష్ట్ర నాయకత్వానికి పంపాలని, లక్ష్మారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని శంకర్ బాబు డిమాండ్ చేశారు. అలాగే, పార్టీ కార్యకర్తలు ఎవరూ అయోమయానికి గురికావద్దని, అధికారిక పార్టీ నిర్ణయాలనే అనుసరించాలని సూచించారు.

Tags: