సిక్కింలో వర్ష బీభత్సం.. వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులు

సిక్కింలో వర్ష బీభత్సం.. వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులు

  • భారీ వరదలకు ఆరుగురు గల్లంతు
  • బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం 
  • ఉత్తర సిక్కింలో 229 మి.మీల వర్షాపాతం నమోదు 

భారత్ ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానతో పెద్దఎత్తున వరదలు వచ్చాయి. దీంతో పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకూ ఉత్తర సిక్కింలో 220 మి.మీకు పైగా వర్షం కురిసింది. దీంతో తీస్తాలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఈ వరదల ప్రభావిత ప్రాంతాల్లో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 

అదేవిధంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. ఇక, వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యాటకులను ఇక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్ల మరమ్మతు పనులకు వారం రోజుల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. వరదల్లో ఇప్పటి వరకు ఆరుగురు గల్లంతు కాగా వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్లు చెప్పారు. 

Read More హైదరాబాదులో ఎన్ఐఏ తనిఖీల కలకలం

కాగా, సిక్కింలోని సంక్లాంగ్ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోయి చుంగ్హాంగ్, లాచుంగ్ ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అధికారులతో సమీక్షించారు. బాధిత ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులపై ఆరాతీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. వరదల్లో  చిక్కుకుపోయిన పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సిక్కిం సీఎస్ విజయ్ భూషణ్ పాఠక్ తెలిపారు.

Related Posts