అనంతపురం వాసులకు శుభవార్త.. HPCL నుంచి స్మార్ట్ అండ్ సేఫ్ 'హెచ్‌పీ నవ్య' సిలిండర్ ఆవిష్కరణ
- మహిళల శ్రమ తగ్గించే సరికొత్త సిలిండర్.. ప్రత్యేక యాప్‌తో బుకింగ్ సౌకర్యం
HP Navya Cylinder: అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామంలోని శ్రీ లక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయంలో హెచ్‌పీసీఎల్ నూతనంగా ప్రవేశపెట్టిన ‘హెచ్‌పీ నవ్య’ గ్యాస్ సిలిండర్‌ను ఘనంగా లాంచ్ చేశారు. హెచ్‌పీసీఎల్ చీఫ్ రీజినల్ మేనేజర్ పంకజ్ కుమార్, ప్లాంట్ మేనేజర్ అవినాష్, సేల్స్ ఆఫీసర్ ఎం.ఏ. అశిం, మేనేజర్ కే. వికాస్ రెడ్డి తదితర అధికారులు కార్యక్రమంలో పాల్గొని సిలిండర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఇప్పటికే బెంగళూరులో ప్రారంభించిన ఈ నూతన సిలిండర్‌ను తాజాగా అనంతపురంలోనూ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా చీఫ్ రీజినల్ మేనేజర్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని హెచ్‌పీ నవ్య సిలిండర్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. సిలిండర్‌లో ఎంత మేర గ్యాస్ ఉందో సులభంగా తెలుసుకునే విధంగా దీని రూపకల్పన చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా మహిళలు సైతం పెద్దగా శ్రమ పడకుండా సిలిండర్‌ను సులభంగా ఒక చోటు నుంచి మరోచోటుకు మార్చుకునేలా తేలికగా రూపొందించినట్లు వివరించారు. వినియోగ సమయంలో ప్రమాదాల అవకాశాలను తగ్గించేలా భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
హెచ్‌పీ నవ్య సిలిండర్ వినియోగదారులకు వేగవంతమైన డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని పంకజ్ కుమార్ తెలిపారు. బుకింగ్ చేసిన తర్వాత సుమారు 90 నిమిషాల్లోనే సిలిండర్‌ను ఇంటి వద్దకు చేరేలా సేవలను అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నవ్య సిలిండర్ బుకింగ్ కోసం హెచ్‌పీసీఎల్ ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, వినియోగదారులు ఆ యాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. హెచ్‌పీ నవ్య సిలిండర్ రీఫిల్ ధర రూ.1,739గా ఉంటుందని వెల్లడించారు. అనంతపురం నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ నూతన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.



