వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత: సీఎం రేవంత్‌రెడ్డి

వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత: సీఎం రేవంత్‌రెడ్డి

  • ఢిల్లీలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసిన రేవంత్‌రెడ్డి

Revanth Reddy: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపాయని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్‌ రోడ్డు వంటి అభివృద్ధి పనులతో పాటు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ద్వారా పాలనపై చెరగని ముద్ర వేసిన నాయకుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

Read More కాంగ్రెస్‌ 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. కేటీఆర్‌ పిలుపు

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, ఎం. అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజలకు అందించిన సేవలు, ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు.