ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వానికి 1000 రోజులు: మహేష్‌ కుమార్‌ గౌడ్

ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వానికి 1000 రోజులు: మహేష్‌ కుమార్‌ గౌడ్

  • రైతులు, మహిళలు, యువతే కేంద్రంగా ప్రజాపాలన.. 1000 రోజులపై మహేష్‌ గౌడ్‌

Mahesh Kumar Goud: ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ప్రజాపాలనలో 1000 రోజులు ఒక మైలురాయిగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రైతులు, మహిళలు, యువత, బలహీనవర్గాలను ప్రభుత్వ విధానాలకు కేంద్రబిందువుగా మార్చామని చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కల్పించామని, రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్‌తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. రుణమాఫీ కోసం రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 25.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించామని చెప్పారు. ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రూ.30 వేల కోట్లు, సన్నవడ్ల బోనస్‌కు దాదాపు రూ.4 వేల కోట్లు, రైతుబీమాకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే ఎల్పీజీ సిలిండర్‌ అందిస్తున్నామని చెప్పారు. పేదల కోసం 16.32 లక్షల కొత్త రేషన్‌ కార్డులు జారీ చేశామని, మొత్తం 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందని తెలిపారు.

Read More తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభ.. కవిత ప్రసంగంపై ఆసక్తి

తెలంగాణ యువతలో విశ్వాసం కల్పించేలా 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అల్పాహారం ప్రారంభించడంతో పాటు 100 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ సామాజిక న్యాయ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.