నిజామాబాద్ సభలో కవిత కన్నీరు.. “నన్ను పార్టీల నుంచి ఎందుకు పంపించారు?”
- సొంత గడ్డపై భావోద్వేగానికి గురైన కవిత.. సభలో కన్నీళ్లు
Kavitha Nizamabad: నిజామాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన పాంచజన్య సంకల్ప సభలో పార్టీ అధ్యక్షురాలు కవిత భావోద్వేగానికి గురయ్యారు. సభలో ప్రసంగిస్తూ తనను పార్టీల నుంచి ఎందుకు పంపించారంటూ ప్రశ్నించారు. తన సొంత గడ్డపై, తన ఇంటికి వచ్చినట్టుగా భావించడంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు వచ్చాయని కవిత తెలిపారు.
“నేను పిరికిదాన్ని అనుకోవద్దు.. ఇంటికి వచ్చినా, సొంత గడ్డ మీదకు వచ్చినా కాబట్టి కన్నీరు ఆగట్లేదు” అంటూ కవిత సభలో మాట్లాడారు. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తనను దూరం చేసిన పరిస్థితులపై సభా వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పంతం పట్టి తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించానని కవిత తెలిపారు. తెలంగాణ కోసం, ప్రజల కోసం తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నిజామాబాద్ సొంత గడ్డ కావడంతో సభకు వచ్చిన ప్రజలు, కార్యకర్తల మధ్య ఆమె భావోద్వేగానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది.



