వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ చార్జ్‌షీట్‌

వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ చార్జ్‌షీట్‌

  • వెయ్యి రోజులు.. వెయ్యి అబద్ధాలు.. బీఆర్‌ఎస్‌ భారీ ఉద్యమానికి శ్రీకారం

BRS Chargesheet: కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు 1000 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారెంటీల అమలు తీరును ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేసిందనే అంశాలను ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలు పరిస్థితిపై బీఆర్ఎస్ ప్రశ్నలు సంధించనుంది. 11 డిక్లరేషన్ల అమలు తీరుపైనా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు “1000 రోజులు.. 1000 అబద్ధాలు” అనే నినాదంతో సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ధర్నాలు, రైతు సమావేశాలు, నిరసనలు, ముట్టడి కార్యక్రమాలు, యువజన ర్యాలీలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.

Read More మహాత్మా జ్యోతిబా ఫూలే – సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం. -తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్  గూడూరు శ్రీనివాస్

ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేలా ఆటో ర్యాలీలు, ప్రజా పిటిషన్లు, గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్రణాళిక రూపొందించింది. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువతకు సంబంధించిన సమస్యలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ఎదురైన సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు.. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేయనుంది. దీంతో బీఆర్ఎస్ చేపట్టనున్న వారంపాటు నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచే అవకాశముంది.