కోదాడలో ఉద్రిక్తత.. ఆందోళనకారులపై సీఐ వీరంగం...
విశ్వంభర, సూర్యాపేట జిల్లా:- కోదాడ పట్టణంలో డబ్బకొట్టు తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత ముప్పై ఏళ్లుగా డబ్బకొట్టుపైనే జీవనం సాగిస్తున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.ఈ ఆందోళనను అదుపు చేయాల్సిన కోదాడ సీఐ శివశంకర్ అత్యుత్సాహం ప్రదర్శించారు. నిరసన తెలుపుతున్న మందల ఉపేందర్‌పై ఒక్కసారిగా దాడికి దిగి రోడ్డుపై నెట్టేసి, లాక్కెళ్లి పోలీసు కారులో పడేశారు. అడ్డుకోబోయిన మహిళలను సైతం తోసేస్తూ ఆయన సృష్టించిన వీరంగం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ ఘటనను విధుల్లో భాగంగా వీడియోలు చిత్రీకరిస్తున్న ఓ స్థానిక జర్నలిస్టుపై సీఐ రెండుసార్లు దాడికి దిగడం పట్ల జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి పోలీసు అధికారులే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సదరు సీఐపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



