గొల్లగుప్ప బడిలో అసలేం జరిగింది? క్లోరోక్విన్ మింగిన చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

గొల్లగుప్ప బడిలో అసలేం జరిగింది? క్లోరోక్విన్ మింగిన చిన్నారుల ప్రాణాలతో చెలగాటం

  • గొల్లగుప్పలో విషాదం.. మాత్రల పంపిణీ తర్వాత ఇద్దరు విద్యార్థుల మృతి

Chloroquine Tablets: ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాక మండలం గొల్లగుప్పలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసిన అనంతరం పలువురు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మొత్తం 73 మంది విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేయగా, వారిలో సుమారు 20 మంది విద్యార్థులకు వాంతులు, అస్వస్థత వంటి సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మరో ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్న సమాచారంతో గొల్లగుప్పలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది.

Read More శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..

అయితే విద్యార్థుల అస్వస్థతకు క్లోరోక్విన్ మాత్రలే కారణమా, మాత్రల మోతాదు లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే విషయాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఘటనకు సంబంధించి వైద్యాధికారుల పరిశీలన అనంతరమే విద్యార్థుల అస్వస్థత, మరణాలకు ఖచ్చితమైన కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు ఎవరి సూచనల మేరకు పంపిణీ చేశారు, పంపిణీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే అంశాలపైనా స్పష్టత రావాల్సి ఉంది.