చికిత్స పొందుతూనే పాలనపై ఫోకస్.. కేరళ నుంచి పవన్ కీలక సమీక్షలు
- ఫైళ్ల పరిశీలన నుంచి కీలక నిర్ణయాల వరకు.. కేరళ నుంచే పవన్ విధులు
Deputy CM Pawan Kalyan: వైద్యం కోసం ఈ నెల 22న కేరళకు వెళ్లిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. చికిత్స పొందుతూనే తన శాఖల పనితీరును అక్కడి నుంచే నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఆరోగ్య చికిత్స కొనసాగుతున్నప్పటికీ పాలనా వ్యవహారాలకు విరామం ఇవ్వకుండా ఫైళ్లను పరిశీలించడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం, కీలక నిర్ణయాలు తీసుకోవడం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై కూడా అధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ‘గుడి బాట’ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలోని 100కుపైగా పుణ్యక్షేత్రాలకు సంబంధించిన సుమారు 205 కిలోమీటర్ల రహదారులను రూ.120 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పూర్తయిన రహదారులను నాణ్యతా ప్రమాణాలతో తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి ప్రాంతంలోని ఆలయ రహదారుల అభివృద్ధికి అదనంగా రూ.30 కోట్లు కేటాయించే అంశంపైనా చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలపై కూడా పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో భాగంగా 5,499 హెక్టార్లలో 55 లక్షల తాటి విత్తనాలను నాటే లక్ష్యంతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. చికిత్స కోసం కేరళలో ఉన్నప్పటికీ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని జనసేన వర్గాలు పేర్కొన్నాయి. స్థలం మారినా బాధ్యతల్లో ఎలాంటి మార్పు లేదని, ప్రజల కోసం ఎక్కడ ఉన్నా పనిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపాయి.



