పొలం అమ్మి అర్జున్ రెడ్డి తీశారు.. సందీప్‌పై విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్
- సందీప్ పిలిస్తే రాకపోతే నా బతుకు వేస్ట్.. విజయ్ దేవరకొండ
Vijay Deverakonda: ‘అర్జున్ రెడ్డి’ సినిమా తన జీవితంలోనే కాకుండా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కుటుంబానికి కూడా ఎంతో కీలకమైనదని హీరో విజయ్ దేవరకొండ గుర్తుచేసుకున్నారు. సినిమా చేయాలనే పట్టుదలతో సందీప్ కుటుంబం పెద్ద రిస్క్ తీసుకుందని తెలిపారు. తమపై నమ్మకంతో సినిమా కోసం కుటుంబానికి చెందిన పొలాన్ని అమ్మి మరీ డబ్బులు సమకూర్చారని చెప్పారు. అప్పట్లో ఎవరికీ పెద్దగా గుర్తింపు లేకపోయినా.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ముందుకు వెళ్లారని విజయ్ తెలిపారు.
‘అర్జున్ రెడ్డి’ సమయంలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకున్న విజయ్.. ఆ సినిమా తమ కెరీర్‌లను పూర్తిగా మార్చేసిందని చెప్పారు. సందీప్ రెడ్డి వంగా తన కథను నమ్మి సినిమాను ఎంతో పట్టుదలతో తెరకెక్కించారని, అందుకోసం ఆయన కుటుంబం కూడా అండగా నిలిచిందని పేర్కొన్నారు. సినిమా కోసం ఇంతటి రిస్క్ తీసుకోవడం, కొత్తవాళ్లపై నమ్మకం పెట్టుకోవడం సాధారణ విషయం కాదని విజయ్ అన్నారు. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ‘అర్జున్ రెడ్డి’ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుందని గుర్తుచేసుకున్నారు.
సందీప్ రెడ్డి వంగాతో తనకు ఉన్న అనుబంధం ఇప్పటికీ ఎంతో ప్రత్యేకమని విజయ్ దేవరకొండ చెప్పారు. ఆయన పిలిచినప్పుడు తాను వెళ్లకుండా ఉండలేనని, సందీప్ కోసం ఎప్పుడైనా నిలబడతానని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ‘నువ్వు పిలిచినప్పుడు రాకపోతే బతికి వేస్ట్’ అంటూ సందీప్‌తో తనకున్న స్నేహాన్ని చాటుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’తో మొదలైన ఈ ప్రయాణం తమ మధ్య సాధారణ సినిమా సంబంధాన్ని దాటి బలమైన స్నేహంగా మారిందని విజయ్ చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.



