నాపై ఆరోపణలు నిజమైతే నిరూపించండి.. చంద్రబాబుకు జోగి రమేష్ ఛాలెంజ్
- గుంటూరు భూముల వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరపాలి: జోగి రమేష్
Jogi Ramesh: గుంటూరులో కోట్ల విలువైన ఇరిగేషన్ భూముల వ్యవహారంపై తనపై వస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనపై ప్రతిరోజూ తప్పుడు వార్తలు రాస్తూ రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. తన కుమారుడి వ్యక్తిగత వ్యవహారాలను కూడా బయటకు తీసుకొచ్చి తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు ఇరిగేషన్ భూముల వ్యవహారంలో అసలు ప్రైవేట్ వ్యక్తి ఎవరో ప్రభుత్వం బయటపెట్టాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారంలో తన ప్రమేయం ఉందని ఆరోపణలు చేస్తున్నవారు ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని, అవసరమైతే విజిలెన్స్ దర్యాప్తు జరిపించి అసలు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు.
తన అప్పులను తీర్చుకునేందుకు తనకు ఉన్న భూములను విక్రయిస్తున్నానని జోగి రమేష్ తెలిపారు. అయితే వాటికి, గుంటూరు ఇరిగేషన్ భూముల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనను, తన కుటుంబాన్ని ఎంతగా టార్గెట్ చేసినా నిజాలు బయటకు వస్తాయని అన్నారు. తనపై కక్ష ఉంటే ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జోగి రమేష్ అన్నారు.



