ప్రభుత్వ కార్యక్రమం ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో ఔట్

ప్రభుత్వ కార్యక్రమం ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో ఔట్

  • స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫోటోకు చోటేదీ

Telangana Politics: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జరిగిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చకు దారితీసింది. కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్‌, వేం నరేందర్‌రెడ్డి తదితరుల ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే మహబూబాబాద్‌ జిల్లా మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఫోటో మాత్రం ఫ్లెక్సీలో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ కార్యక్రమంలో జిల్లా మంత్రికి సంబంధించిన ఫోటో లేకపోవడం పట్ల కాంగ్రెస్‌ వర్గాల్లో వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. కార్యక్రమం నిర్వహించిన వారు ఫ్లెక్సీలో ఆమె ఫోటోను ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫోటోలను ఏర్పాటు చేసి.. అదే జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ ఫోటోను మాత్రం పెట్టకపోవడం వెనుక కారణమేంటనే చర్చ మొదలైంది.

Read More ప్రిన్సిపల్‌ను చంపింది టెన్త్ క్లాస్ విద్యార్థులే!.. నల్గొండలో దారుణ హత్య కేసు

ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీల విషయంలో ప్రోటోకాల్‌, స్థానిక ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత వంటి అంశాలు పాటించాల్సి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. తాజాగా గూడూరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా మంత్రి ఫోటో కనిపించకపోవడం రాజకీయంగా ఎలాంటి సంకేతాలకు దారితీస్తుందనే చర్చ కూడా కాంగ్రెస్‌ శ్రేణుల్లో జరుగుతోంది. అయితే ఫ్లెక్సీలో కొండా సురేఖ ఫోటో ఎందుకు లేదన్న దానిపై సంబంధిత నిర్వాహకుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.