జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లీ ఈసీజీ సేవలకు బ్రేక్.. గంటసేపు రోగుల నిరీక్షణ
- జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీజీ సేవలపై వరుస ఫిర్యాదులు.. అధికారులపై ప్రశ్నలు
Zaheerabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈసీజీ సేవల నిర్వహణపై మరోసారి నిర్లక్ష్యం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈసీజీ పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు సుమారు గంటసేపు వేచి చూసినా డ్యూటీలో ఉండాల్సిన టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితం కూడా క్రిటికల్ పేషెంట్‌కు అత్యవసరంగా ఈసీజీ అవసరమైన సమయంలో డ్యూటీలో ఉండాల్సిన టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడంతో పేషెంట్ కేర్ సిబ్బందే ఈసీజీ తీసిన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన మరువకముందే మరోసారి అదే పరిస్థితి ఎదురవడంతో ఆసుపత్రిలో ఈసీజీ సేవల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు సకాలంలో పరీక్షలు అందకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్యూటీ సమయంలో ఈసీజీ టెక్నీషియన్ ఆసుపత్రిలో ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం పేద రోగులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు.
ఈసీజీ వంటి అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ఆసుపత్రిలో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తాజా ఘటనపై సమగ్ర విచారణ జరిపి, డ్యూటీలో సిబ్బంది అందుబాటులో లేకపోవడానికి కారణాలను గుర్తించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



