గణేశ్ చతుర్థికి 2 వేలకుపైగా పర్యావరణహిత వినాయక విగ్రహాలు
- గణేశ్ ఉత్సవాలకు థేనీలో భారీ ఏర్పాట్లు.. పర్యావరణహిత విగ్రహాలకు డిమాండ్
Tamil Nadu Eco Friendly Ganesha: తమిళనాడులోని థేనీలో గణేశ్ చతుర్థి సందర్భంగా పర్యావరణహిత వినాయక విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా యామ్ పిండి, పేపర్ పల్ప్ వంటి సహజ పదార్థాలతో విగ్రహాలను తయారు చేస్తున్నారు. నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు.
థేని జిల్లా హిందూ ఉయిర్వు ఫ్రంట్ నాయకుడు రామరాజ్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలకు అనుగుణంగానే పర్యావరణహిత వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం సమయంలో నీటికి హాని కలగకుండా సహజ పదార్థాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. థేనీలో 2 అడుగుల నుంచి 10 అడుగులకు పైగా ఎత్తు కలిగిన వివిధ రకాల గణేశుడి విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు.
ఒక్కో భారీ వినాయక విగ్రహాన్ని పూర్తి చేయడానికి సుమారు 15 నుంచి 20 రోజుల సమయం పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 15న నిర్వహించనున్న గణేశ్ ఉత్సవ ర్యాలీలో 165కుపైగా విగ్రహాలను తీసుకెళ్లనున్నట్లు రామరాజ్ వెల్లడించారు. గణేశ్ చతుర్థి సందర్భంగా పర్యావరణాన్ని కాపాడుతూ ఉత్సవాలను నిర్వహించేందుకు ఈ విగ్రహాల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.



