త్రివర్ణ పతాకాన్ని చింపేస్తారా?.. న్యూయార్క్‌లో భారత జెండాకు ఘోర అవమానం
- న్యూయార్క్‌లో రెచ్చిపోయిన ఆందోళనకారుడు.. భారత జెండా చింపివేతపై భగ్గుమన్న జనం
New York: న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద భారత జాతీయ జెండా చింపివేసినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నిరసనల్లో పాల్గొన్న ఓ వ్యక్తి చేతిలో ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని చింపుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించడంతో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది.
మోహన్ భగవత్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నిరసనకారులు ఆందోళన చేపట్టగా.. మరోవైపు ఆయనకు మద్దతుగా వచ్చిన వారితో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మాడిసన్ స్క్వేర్ గార్డెన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన వ్యక్తం చేయడం ఒక అంశమైతే.. భారత జాతీయ జెండాను చింపివేయడం మరో అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే భారత జెండాను చింపిన వ్యక్తిపై న్యూయార్క్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారా? అదుపులోకి తీసుకున్నారా? కేసు నమోదు చేశారా? అనే విషయాలపై స్పష్టమైన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. వైరల్ వీడియో ఆధారంగా వ్యక్తి వివరాలను నిర్ధారించడం కంటే.. పోలీసులు అధికారికంగా ఏం చెబుతారన్నదే కీలకంగా మారింది.



